: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ గ్రీన్ సిగ్నల్
ఈ-కామర్స్ మార్కెట్‌లో తమ దేశీయ పోటీదారు ఫ్లిప్‌కార్ట్ ఆశజూపిన 900 - 950 మిలియన్ డాలర్ల ఆఫర్‌కు స్నాప్‌డీల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ మేరకు స్నాప్‌డీల్ బోర్డు సభ్యులు అంగీకరించినట్లు సమాచారం. ఇంకా స్నాప్‌డీల్ షేర్ హోల్డర్లు ఒప్పుకోవాల్సి ఉంది. ఒకవేళ వాళ్లు కూడా ఒప్పుకుంటే స్నాప్‌డీల్ వారి ఆన్‌లైన్ మార్కెటింగ్ బిజినెస్ మొత్తం ఫ్లిప్‌కార్ట్ వశమవుతాయి. ఈ విలీనానికి సంబంధించిన ఫ్లిప్‌కార్ట్ నుంచి గానీ, స్నాప్‌డీల్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాధానం రాలేదు.
కాకపోతే స్నాప్‌డీల్ వారు అడిగిన మొత్తాన్ని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుండటంతో షేర్ హోల్డర్లు కూడా అమ్మకానికి మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట 800 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్‌కార్ట్, తర్వాత కొద్ది రోజులకు 950 మిలియన్ డాలర్లకు ఆఫర్‌ను సవరణ చేసింది. దేశీయ ఆన్‌లైన్ మార్కెట్‌లో అమెజాన్, స్నాప్‌డీల్‌లు ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా ఉన్నాయి. ఇక స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వశమైతే కేవలం అమెజాన్‌తో మాత్రమే పోటీ ఉంటుంది.