: భాగ్యనగరిలో డ్రగ్స్ వాడుతున్న 40 మంది టెక్కీలు... ఐటీ కంపెనీలకు హెచ్చరికలు
సినిమా ఇండస్ట్రీతో పాటు హైదరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంపై సాక్ష్యాలు సేకరించిన ఎక్సైజ్ విభాగం, ఇప్పటివరకూ 40 మంది టెక్కీలు మాదకద్రవ్యాలను తీసుకుంటున్నట్టు గుర్తించి, వారు పని చేస్తున్న ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో మొత్తం 4 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండగా, , కాల్విన్ మస్కరెన్హాస్, మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ల అరెస్ట్ తరువాత జరిపిన విచారణలో 40 మంది టెక్ నిపుణులకు వీరు డ్రగ్స్ అందించినట్టు ఎక్సైజ్ అధికారులు తేల్చారు.
నిందితుల సెల్ ఫోన్లు, కాల్ డేటా, మెసేజ్ డేటా నుంచి ఈ సమాచారం సేకరించారని, వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖకు పంపగా, వారు సదరు కంపెనీలను హెచ్చరించారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు ఇవ్వగా, 100కు పైగా స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు సైతం మత్తు మహమ్మారిలో చిక్కుకున్నట్టు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.