: ఆసక్తికర పరిశోధన... డబ్బుతో ఆనందాన్ని కొనుక్కోవచ్చు
డబ్బుతో ఆనందాన్ని కొనుక్కోగలమని పరిశోధకులు చెబుతున్నారు. డబ్బుతో నేరుగా ఆనందాన్ని కొనుగోలు చేయనప్పటికీ... డబ్బు అధికంగా ఉంటే దానితో ఖాళీ సమయాన్ని కొనుగోలు చేయొచ్చని చెబుతున్నారు. ఆ సమయంలో లభించే సేవలతో ఆనందం పొందవచ్చని వారు వివరిస్తున్నారు. ఈ విషయంపై పరిశోధన నిర్వహించేందుకు అమెరికా, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన యువతను ఎంచుకున్నారు. ఈ దేశాల్లోని సుమారు 6,000 మంది యువకులపై పరిశోధన నిర్వహించినట్టు తెలిపారు.
ఇందులో పాల్గొన్న వారు ఇంటిపనులు చేసేందుకు ఎంత మొత్తం వెచ్చిస్తున్నారు? వారి సేవలతో ఎంత సంతృప్తి పొందుతున్నారు? వంటి అంశాలను విశ్లేషించారు. ఇందులో ఇంటి, వంట, తోట పనులు నిర్వర్తించేందుకు నౌకర్లను పెట్టుకున్నట్టు గుర్తించారు. ఆ పనులు నౌకర్లు నిర్వర్తిస్తుండడంతో వారికి ఖాళీ సమయం లభిస్తోందని తెలిపారు. అంతే కాకుండా నౌకర్లందించే సేవలతో వారిలో సంతృప్త భావన కలుగుతోందని గుర్తించారు. దాంతో వారిలో ఆనందం కూడా పెరిగిందని వారు తెలిపారు. దీంతో డబ్బుతో ఉన్నత వర్గాలతో పాటు ఉన్నత మధ్యతరగతిలో కూడా ఆనందం పెరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.