: ఆగిన ముద్రగడ పాదయాత్ర... 24 గంటలు అరెస్ట్
కాపు సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ ఉదయం పాదయాత్రకు బయలుదేరిన ఆయన్ను ఇంటి గేటు ముందే పోలీసులు నిలువరించిన సంగతి తెలిసిందే. ఆపై కాసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన, తన యాత్రను విరమించుకునేది లేదని స్పష్టం చేయడంతో, ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. అరెస్ట్ తరువాత ఏ పోలీస్ స్టేషన్ కూ తీసుకెళ్లే ఉద్దేశం లేదని వెల్లడించిన పోలీసులు, దీన్ని హౌస్ అరెస్ట్ గా చూపుతున్నామని, 24 గంటల పాటు ఆయన ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక, ముద్రగడ ఇంటిలోకి వెళ్లిపోగా, ఇంటి ముందు బందోబస్తును కొనసాగిస్తున్నారు. ముద్రగడ ఇంటిలోకి ఎవరినీ అనుమతించడం లేదు.