: పొద్దున్నే 'పైసా వసూల్' షూటింగ్ లొకేషన్ కు వెళ్లిపోయిన చార్మి
ఈ ఉదయం సిట్ విచారణకు రావాల్సిన హీరోయిన్ చార్మి, ఈ ఉదయం 6 గంటలకే తాను సహ నిర్మాతగా ఉన్న 'పైసా వసూల్' షూటింగ్ లొకేషన్ కు వెళ్లిపోయింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొండాపూర్ ప్రాంతంలో జరుగుతుండగా, నేటి షూటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆమె అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ విచారణ పూర్తి కాగా, ఆయన సలహా, సూచనలను తీసుకునేందుకే చార్మి అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంటరాగేషన్ ఎలా ఉంటుందనే సమాచారాన్ని ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాగా, చార్మి షూటింగ్ లొకేషన్ నుంచే డైరెక్టుగా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చార్మీ విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు సిట్ కార్యాలయం వద్ద రోజువారీ కంటే భద్రతను అధికం చేశారు. మరోవైపు మీడియా సైతం పెద్దఎత్తున మోహరించింది.