: భారత్ - చైనాల మధ్య వివాదానికి కారణం అజిత్ దోవల్?
డోక్లాం సరిహద్దు ప్రాంతం విషయంలో గత నెలరోజులుగా భారత్ - చైనా దేశాల మిలటరీల మధ్య నెలకొన్న సందిగ్ధ పరిస్థితికి అసలు కారణం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అని చైనా మీడియా ఓ కథనం ప్రచురించింది. ఆ కారణంగానే జూలై 27 - 28 తేదీల్లో బ్రిక్స్ కూటమి జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి హాజరవనున్న ఆయనతో చైనా ప్రతినిధులు డోక్లాం వివాదం గురించి చర్చించేందుకు సిద్ధంగా లేరని చెప్పుకొచ్చింది. చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తమ సంపాదకీయ వ్యాసాల్లో భారత్ - చైనా వివాదం గురించి రోజుకో రకంగా రాస్తుంది. చైనా రక్షణ శాఖ చెప్పాలనుకుంటున్న విషయాలన్నీ ఈ పత్రిక ప్రచురిస్తోంది.
ఈ నేపథ్యంలోనే దోవల్ పర్యటన వల్ల వివాదం సద్దుమణుగుతుందనే ఆలోచనలకు కళ్లెం వేయాలని భారత మీడియాకు గ్లోబల్ టైమ్స్ హితబోధ చేస్తోంది. ఇప్పటికే `చైనా మిలటరీని తక్కువంచనా వేయొద్దు`, `మా భూభాగాన్ని మీరు ఆక్రమించారు. వెనక్కి వెళ్లాల్సింది మీరు` అంటూ వివిధ ఆరోపణలను చైనా మీడియా చేసింది. బీజింగ్‌తో ఈ విషయంపై చర్చలు జరిపేందుకు భారత విదేశాంగ శాఖ సిద్ధంగానే ఉన్నా భారత సైన్యం వెనక్కి వెళితే గానీ, చర్చలు జరిపే ప్రసక్తే లేదని చైనా చెబుతోంది. భారత్ కూడా తమ సైన్యం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని, వీలైతే ఇద్దరి సైన్యాలను వెనక్కి పిలిచి, ఆ తర్వాతే శాంతి చర్చలు జరుపుదామని చైనాకు వివరించింది. దీనికి చైనా ససేమిరా అనడంతో అజిత్ దోవల్ పర్యటనతోనైనా ఈ వివాదంలో ఏదైనా పురోగతి వస్తుందని భారత్ ఆశిస్తోంది.