: బలవంతంగా చార్మి రక్త నమూనాలు సేకరించరాదు!: 'సిట్'కు హైకోర్టు ఆదేశం
ప్రముఖ నటి చార్మి పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సిట్ విచారణలో చార్మితో పాటు న్యాయవాదిని అనుమతించేందుకు నిరాకరించింది. బలవంతంగా చార్మి రక్త నమూనాలు సేకరించరాదని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆమెను విచారించాలని, విచారణా బృందంలో మహిళను నియమించాలని ఆదేశించింది. ఒకవేళ, ఒకే రోజులో విచారణ పూర్తి కాకపోతే మరోసారి పిలవవచ్చని, విచారణ ప్రాంతాన్ని సాయంత్రం సిట్ అధికారులకు చెబుతామని హైకోర్టు పేర్కొంది.
అంతకుముందు, చార్మి నిందితురాలు కాదని, సాక్షి కూడా కాదని, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం చార్మీకి ఇష్టం లేదని, ఆర్టికల్ 20 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలని ఆమె తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎక్సైజ్ సిట్ ఆఫీసు పోలీస్ స్టేషన్ లా ఉందని, చార్మి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కోర్టులో తెలిపారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ శాంపిల్స్ తీసుకున్న విధానం సరిగ్గా లేదని, బలవంతంగా శాంపిల్స్ సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని చార్మి తరపు న్యాయవాది అన్నారు. కాగా, చార్మి ఇంటికే వస్తామని నోటీసులు ఇచ్చిన సమయంలోనే చెప్పామని, కానీ, తానే సిట్ ఆఫీస్ కు వస్తానని ఛార్మి చెప్పిందని సిట్ వాదనలు వినిపించింది.
అయితే, చార్మి అనుమతిస్తే కనుక, ఇప్పుడైనా ఆమె ఇంటికి వెళ్తామని హైకోర్టులో సిట్ తెలిపింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని, నటుడు నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సేకరించలేదని, డ్రగ్స్ డీలర్ కాల్విన్ సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చామని హైకోర్టులో సిట్ పేర్కొంది. హైదరాబాద్ మరో ముంబైలా మారిందని, పబ్బుల్లో చాక్లెట్లు, కూల్ డ్రింక్ లు రూపంలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నాయని తెలిపింది.
నోటీసులు అందుకున్నవారు నిజాయతీపరులైతే భయపడాల్సిన అవసరమేముందని కోర్టులో చెప్పిన సిట్, చార్మి వేసిన పిటిషన్ ఓ పబ్లిసిటీ స్టంట్ అంటూ అభివర్ణించింది. సిట్ విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఈ పిటిషన్ వేశారని, విచారణకు వచ్చేవారితో మర్యాదగా ప్రవర్తిస్తున్నామని, చార్మిని మహిళా పోలీసులే విచారిస్తారని సిట్ పేర్కొంది. డ్రగ్స్ సరఫరాదారులు, విక్రయదారులు ఎవరో తేల్చడమే తమ పని అని, సినీ ఇండస్ట్రీపై తమకు గౌరవం ఉందని, కొంతమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని, ఇండస్ట్రీని తాము టార్గెట్ చేయలేదని సిట్ స్పష్టం చేసింది.