: దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకే పిటిషన్... అనుమతిస్తే చార్మి ఇంటికి వెళ్లి విచారణ: కోర్టులో సిట్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే తనను విచారించాలని కోరుతూ సినీ నటి చార్మి వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. బలవంతంగా నమూనాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్మి నిందితురాలు కాదు, సాక్షి కూడా కాదని, ఆర్టికల్ 20 ప్రకారం ఆమె స్వేచ్ఛని కాపాడాలని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు వేసిన పిటిషన్ గా సిట్ పేర్కొంది.
నోటీసులు అందుకున్న వారు నిజాయతీ పరులైతే భయపడడం ఎందుకని ప్రశ్నించింది. తాము ఎవరి నుంచీ బలవంతంగా నమూనాలు సేకరించడం లేదని, పూరీ జగన్నాథ్ తదితరులు స్వచ్చందంగా నమూనాలను ఇచ్చారని కోర్టుకు తెలిపింది. నవదీప్ నిరాకరించడంతో తీసుకోలేదని కూడా పేర్కొంది. అనుమతిస్తే ఇప్పుడైనా చార్మి ఇంటికి వెళ్లి విచారిస్తామని పేర్కొంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నోటీసులు ఇవ్వడం జరిగిందని సిట్ వివరించింది.