: డ్రగ్స్ తో కాజల్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు సంబంధం?.. ఒత్తిడిలో హీరోయిన్లు!
డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ సిట్ విచారణతో ఇప్పటికే టాలీవుడ్ వణికిపోతోంది. నిన్న కాజల్ మేనేజర్ రోనీ అలియాస్ రాన్ సన్ జోసెఫ్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా రోనీ మేనేజర్ గా వ్యవహరించాడు.
రోనీని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, టాలీవుడ్ మరోసారి షాక్ కు గురైంది. ముగ్గురు హీరోయిన్లతో మేనేజర్ గా ఆయనకు సంబంధాలు ఉండటంతో, ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు, రోనీని విచారిస్తే, డ్రగ్స్ వ్యవహారంలో మరిన్ని కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోనీ వద్ద మాదకద్రవ్యాలు లభ్యం కావడంతో... పరిశ్రమలో ఈ వ్యవహారంతో మరికొంత మంది హీరోయిన్లకు కూడా లింక్ ఉండవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాజల్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, ఈ ముగ్గురు భామలు కూడా సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, వీరు ముగ్గురూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం.