: చైనా అధ్యక్షుడికి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు... వివాదం వివాదమే, స్నేహం స్నేహమే!
భారత్, చైనాల మధ్య ఏ సమయంలో యుద్ధ వాతావరణం నెలకొంటుందో చెప్పలేని పరిస్థితిలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహశీలతను చాటుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌లకు వారి వారి పుట్టినరోజుల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చైనాకు చెందిన సోషల్ మీడియా వెబ్‌సైట్ సీనా వైబో ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. డోక్లాం వివాదం మొదలైన నాటి నుంచి చైనా సోషల్ మీడియాలో మోదీ ఆరు పోస్టులు చేశారు. జూన్ 15న జీ జిన్‌పింగ్, జూలై 1న లీ కెకియాంగ్ పుట్టినరోజులకు ఆయన సీనా వైబోలో పోస్ట్ పెట్టారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు, సిచువాన్ ప్రాంతంలో కొండచరియలు విరిగి చైనా దేశస్తుడు మావో జియాన్ చనిపోయినపుడు కూడా మోదీ పోస్టులు పెట్టారు. మోదీ సీనా వైబో అకౌంట్‌కు 1,69,119 మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఆరు పోస్టులకు దాదాపు 1,089 మంది చైనీయులు తమ కామెంట్లు పోస్టు చేశారు. వీటిలో డోక్లాం వివాదానికి సంబంధించిన కామెంట్లు కూడా కొన్ని ఉన్నాయి.