: రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎలా జరుగుతుందో తెలుసా...? ఎన్నో ప్రత్యేకతలు
దేశ 14వ రాష్ట్రపతిగా నేడు రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ముందుగా కోవింద్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. ఆయన వెంట రాష్ట్రపతి సైనిక కార్యదర్శి కూడా ఉంటారు. రాష్ట్రపతి భవన్ నుంచి ప్రణబ్ ముఖర్జీ, కోవింద్ లను ఒకే కారులో అశ్వకదళం పార్లమెంటు సెంట్రల్ హాల్ కు సగౌరవంగా తోడ్కొని వెళుతుంది. అక్కడ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వారికి స్వాగతం పలికి పార్లమెంటు సెంట్రల్ హాల్ కు తీసుకెళతారు.
అక్కడ జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం హోంశాఖ కార్యదర్శి రాష్ట్రపతి ఎన్నిక వివరాలను లాంఛనంగా చదివి వినిపిస్తారు. ఆ తర్వాత కోవింద్ తో రాష్ట్రపతిగా ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ ప్రమాణం చేయిస్తారు. ఆ వెంటనే సైనికులు 21 శతఘ్నులను పేల్చి నూతన రాష్ట్రపతి, సర్వసైన్యాధ్యక్షుడైన కోవింద్ కు గౌరవవందనం చేస్తారు.
తర్వాత నూతన రాష్ట్రపతి కోవింద్ ను ప్రణబ్ తన సీటులో ఆసీనులను చేస్తారు. అనంతరం రాష్ట్రపతిగా కోవింద్ ప్రసంగం ఉంటుంది. ఇది ముగిసిన తర్వాత తిరిగి అదే కారులో కోవింద్, ప్రణబ్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. అయితే, ఈసారి కారులో ప్రోటోకాల్ ప్రకారం వారి సీట్లు మారతాయి. అక్కడ త్రివిద దళాలు కొత్త రాష్ట్రపతికి గౌరవవందనం సమర్పిస్తాయి. రాష్ట్రపతి భవన్ గురించి కొత్త రాష్ట్రపతికి పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి వివరించడం సంప్రదాయం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రణబ్ ను ఆయన నూతన నివాసం 10, రాజాజీ మార్గ్ వద్ద కోవింద్ కారులో తీసుకెళ్లి దిగబెడతారు. తిరిగి కోవింద్ తన అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. దీంతో అధికారిక లాంఛనాలు ముగుస్తాయి.