: ఖాళీగా ఉంటే దక్షిణాదికి వెళ్తున్నట్లేనా?: బాలీవుడ్ మీడియాకు ఇలియానా ప్రశ్న
`చేతిలో హిందీ సినిమాలు ఏం లేకపోతే దక్షిణాది సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లేనా?` అంటూ ప్రముఖ నటి ఇలియానా బాలీవుడ్ మీడియాపై చిర్రుబుర్రులాడింది. నటీనటుల గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తే ఎలా? అంటూ మండిపడింది. ప్రస్తుతం ఇలియానా నటించిన `ముబారకన్`, `బాద్షాహు` సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పట్లో మరే బాలీవుడ్ ప్రాజెక్టు తన చేతిలో లేదు. 'ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం దక్షిణాది అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది' అంటూ బాలీవుడ్ మీడియాలో తనపై వచ్చిన వార్తలను ఇలియానా కొట్టిపారేసింది.
గతంలో కూడా ఇలియానా ఖాళీగా ఉన్నపుడు ఇలాగే రాశారు. దీంతో ఇలియానాకు కోపం వచ్చి బాలీవుడ్ మీడియాను కడిగేసింది. `దక్షిణాదిలో నాకు మంచి పేరుంది. ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయి. కథ నచ్చక ఓకే చేయడం లేదు. మంచి పాత్ర వస్తే నేను ఎక్కడైనా నటించేందుకు సిద్ధం. అవకాశాలకోసం వెతుక్కోనవసరం లేదు` అంటూ ఇలియానా ఘాటుగా సమాధానమిచ్చింది.