: రెవెన్యూ అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానంటూ మధ్యప్రదేశ్ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
రెవెన్యూ కేసులను నెలలోపే విచారించని పక్షంలో సంబంధిత అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రావడం, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌహాన్ అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. అప్పటిలోగా, రెవెన్యూ కేసులను నిర్దిష్ట గడువుతో పరిష్కరించకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. కాగా, కలెక్టర్లపై కూడా ఆయన అభ్యంతరకర భాషను ప్రయోగించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.