: సొరచేపతో మైఖేల్ ఫెల్ప్స్ ఈత పోటీ? .... అంతా ట్రాష్!
`ప్రత్యేకంగా రూపొందించిన ఈత దుస్తులు వేసుకుని ప్రపంచ ప్రఖ్యాత ఈతగాడు మైఖేల్ ఫెల్ప్స్, గ్రేట్ వైట్ సొరచేపతో ఈత పోటీకి సిద్ధమవుతున్నాడు. త్వరలో... మీ డిస్కవరీలో!` అంటూ నెల రోజులుగా ఊదరగొట్టి చివరికి కంప్యూటర్లో తయారుచేసిన సొరచేపతో ఫెల్ప్స్ పోటీకి దిగి ఓడిపోయినట్లు చూపించారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని గంట పాటు టీవీలకు అతుక్కుపోయిన జనం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
`అంత డబ్బా కొట్టి, ఇదా మీరు చూపించేది` అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. జూలై 23, రాత్రి 8 గంటలకు `షార్క్ వీక్` కార్యక్రమంలో భాగంగా మైఖేల్ ఫెల్ప్స్, గ్రేట్ వైట్ షార్క్‌తో పోటీ పడడం సాధ్యం కాదని, అందుకు సంబంధించిన సాంకేతిక, విజ్ఞాన కారణాలను, వేగంగా ఈత కొట్టడం వెనక ఉన్న రహస్యాలను, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించిన షార్క్‌తో ఫెల్ప్స్ వేగం విశ్లేషణ వంటి అంశాలతో కార్యక్రమాన్ని ముగించారు. దీంతో నిజంగానే ఫెల్ప్స్, షార్క్‌తో పోటీ పడతారని భావించిన వాళ్లంతా నిరాశ చెంది, `ఇందుకా మమ్మల్ని ఊదరగొట్టింది` , `కంప్యూటర్ గ్రాఫిక్స్ అని ముందే చెప్పాల్సింది` అంటూ ట్విట్టర్లో కామెంట్లు చేశారు.