: పోలవరం ప్రాజెక్టు అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన కాంగ్రెస్, వైసీపీ.. సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి
ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై నేడు రాజ్యసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఈ అంశాన్ని పెద్దల సభలో లేవనెత్తారు. ముంపుకు గురవుతున్న వారిలో ఎంత మందికి పునరావాసం కల్పించారంటూ వీరు ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అప్పజెప్పారని అడిగారు.
ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల సహాయ మంత్రి సంజీవ్ కుమార్ సమాధానమిస్తూ... ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకే ఏపీకి అప్పగించామని చెప్పారు. పునరావాస ప్యాకేజీని త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే రూ. 3వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేశామని... రానున్న 15 రోజుల్లో మరో రూ. వెయ్యి కోట్లను ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పోలవరం నిర్మాణంపై ఏ కోర్టు స్టే విధించలేదని ఆయన స్పష్టం చేశారు.