: సౌదీ అరేబియా వెళ్తున్నారా? అయితే మీ స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ లో ఇవి లేకుండా చూసుకోండి!
ఉపాధి, ఉద్యోగం కోసం సౌదీఅరేబియా వెళ్లేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. సౌదీలో పని చేసే విదేశీ కార్మికుల్లో భారతీయుల సంఖ్య భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అలా వెళ్లి ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా ఉండేందుకు సౌదీలో సవరించిన నిబంధనలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగార్థులు సౌదీ అరేబియా వెళ్లేందుకు విమానం ఎక్కే ముందు తమ ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్ సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. అందులో అశ్లీల వీడియో లేదా ఆడియో క్లిప్ లు, చిత్రాలు లేకుండా చేసుకోవాలని సూచిస్తున్నారు. సౌదీ అరేబియా నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీలానికి సంబంధించిన పలు విషయాలు అగ్రభాగాన ఉన్నాయని తెలిపారు.
అలాగే మాదకద్రవ్యాలు, గసగసాలు, పంది మాంసం, తమలపాకులు, పాన్ మసాలాలతోపాటు ఇస్లాం కాకుండా ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు లేదా సాహిత్యాన్ని కూడా తీసుకెళ్లడం నిషేధమని వారు స్పష్టం చేశారు. ముస్లిం ఖాజాలిచ్చే తాయెత్తులను కూడా సౌదీ అరేబియా అనుమతించడం లేదని వారు స్పష్టం చేశారు. అంతే కాకుండా సౌదీలో ఉద్యోగం కోసం ఏజెంట్ కు 20,000 రూపాయలకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.