: తోటి మహిళా టీచర్ తో అసభ్య ప్రవర్తన... చెప్పులతో కొట్టుకున్న టీచర్లు!
"ఈ రాత్రికి మున్సిపల్ కమిషనర్ రూంకి వచ్చి మాతో గడుపు, రేపు రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తా" అంటూ తోటి మహిళా టీచర్ కు ఆఫర్ ఇచ్చి, ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ టీచర్. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... అనంతపురం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం అంతా వెళ్లిపోయే క్రమంలో ఒక మహిళా టీచర్ కు చెందిన ద్విచక్రవాహనం దగ్గర అదే స్కూల్ లో పని చేసే మైనుద్దీన్ అనే టీచర్ వేచి చూస్తూ, తన ఇంటికి వెళ్లేందుకు వాహనం దగ్గరకు చేరుకున్న ఆమెతో "మీరు యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీ) కో-ఆర్డినేటర్ గా బదిలీ కోసం డీఎంఏ ఆఫీస్ నుండి ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రిలీవ్ చేయలేదని విన్నాను. ఒక పనిచెయ్.. ఈ రోజు రాత్రికి కమిషనర్ రెస్ట్ రూంకు వచ్చి మాతో గడుపు... నీకు రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను" అంటూ ఆఫర్ ఇచ్చాడు.
దీంతో వెంటనే ఆ టీచర్ ‘నీ భార్యను పిల్చుకెళ్లరా. నాకు అలాంటి అలవాట్లు లేవు’ అంటూ దీటుగా సమాధానం చెప్పి, తన కాలి చెప్పును అతనిపైకి విసిరింది. అందరూ చూస్తుండగా చెప్పు విసరడంతో అతను ఎదురుదాడికి దిగాడు. చెప్పు తీసుకుని ఆమెను కొట్టాడు. దీంతో వెంటనే ఇతర టీచర్లు ఈ తతంగాన్ని సెల్ ఫోన్లలో వీడియో తీశారు. అనంతరం నేరుగా మహిళా టీచర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను వేధించడమే కాకుండా, తనపై దాడి చేశాడని, కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.