: ఇంగ్లండ్ పై విమర్శలు గుప్పించిన సెహ్వాగ్!
ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టుపై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. క్రికెట్ ను కనిపెట్టిన మీరు... ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ ను గెలవలేకపోవడం సిగ్గుచేటని ట్వీట్ చేశాడు. రియో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించిన పీవీ సింధును యావత్ దేశం ప్రశంసలతో ముంచెత్తుతున్న వేళ... బ్రిటీష్ జర్నలిస్ట్ మోర్గాన్ చేసిన ట్వీట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. భారత్ లో 123 కోట్ల జనాభా ఉంటే.. రియో ఒలింపిక్స్ లో కేవలం రెండు పతకాలే సాధించి, ఆపై సంబరాలు కూడా చేసుకుంటారా? అంటూ అప్పట్లో మోర్గాన్ అక్కసు వెళ్లగక్కాడు.
అప్పుడు కూడా సెహ్వాగ్ మోర్గాన్ పై విరుచుకుపడ్డాడు. మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాను ఇంగ్లండ్ జట్టు ఓడించిన నేపథ్యంలో, సెహ్వాగ్ ను ఉద్దేశిస్తూ 'ఈ విజయం సరిపోతుందా మిత్రమా?' అంటూ మోర్గాన్ పుండు మీద కారం చల్లాడు. దీంతో, ఒళ్లు మండిపోయిన సెహ్వాగ్... ఈ ఓటమిని కూడా తాము ఎంతగానో గర్విస్తున్నామని, మా జట్టు మరింత దృఢంగా తయారైందనే విషయం అందరికీ తెలిసొచ్చిందని సమాధానం ఇచ్చాడు.