: వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం తీరనిలోటు: బీజేపీ నేత లక్ష్మణ్
వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం తీరని లోటని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పటిష్టతకు వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. దేశ వ్యాప్తంగా అవినీతి రహిత పరిపాలనను ప్రధాని మోదీ అందిస్తున్నారని, ఈ తరహా పాలన కూడా తెలంగాణలో రావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే.. అవినీతి, కుంభకోణాలు, డ్రగ్స్ మాఫియా, ఏరులైపారుతున్న మద్యం, అసంతృప్తితో ఉన్న రైతులు..తప్పా వేరే చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు. ఈ సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు నెరవేరాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచకూడదనే అభిప్రాయాన్ని తాము ఎన్నడూ వ్యక్తం చేయలేదని అన్నారు.