: తేజస్వీ యాదవ్ పోవాల్సిందే... రాహుల్ తో తేల్చి చెప్పిన నితీశ్ కుమార్


తనకు డిప్యూటీగా ఉండి, అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న తేజస్వీ యాదవ్ రాజీనామా చేస్తేనే మహాకూటమి ప్రభుత్వం కొనసాగుతుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తేల్చి చెప్పారు. ప్రభుత్వం నడవాలంటే, ఆయన రాజీనామా చేయక తప్పదని, విమర్శించే అవకాశాలను తాను విపక్షాలకు ఇవ్వదలచుకోలేదని, ఈ విషయంలో లాలూతో మాట్లాడి, కొడుకు చేత రాజీనామా చేయించేలా చూడాలని నితీశ్ కోరినట్టు తెలుస్తోంది.

రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశమైన నితీశ్, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని కూడా ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నెల 28న బీహార్ అసెంబ్లీ సమావేశం కానుండగా, ఆ రోజు నాటికి రాజీనామా చేస్తే, ఇబ్బందులు తలెత్తవని, లేకుంటే అసెంబ్లీలో బీజేపీ వంటి పార్టీలతో విమర్శలు పడాల్సి వస్తుందని ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, లాలూ కుటుంబంపై సీబీఐ పలు కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న వేళ, పలు అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి, కుమారుడు మీసా తదితరులపైనా కేసులు విచారణ దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News