: బడా నిర్మాత కుమారుడు సహా ఇద్దరు యువనటులపై సిట్ కు ఆధారాలు... నేడో రేపో నోటీసులు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖ నిర్మాత కుమారుడితో పాటు, మరో యువ నటుడికి డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని సిట్ పోలీసులు సాక్ష్యాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధారాలు, తరుణ్ వెల్లడించిన విషయాలతో పోలీసులు ఈ ఇద్దరు యువనటులకూ నోటీసులు పంపి విచారించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక తన విచారణలో భాగంగా, నెలలో 15 రోజులు గోవాకు ఎందుకు వెళతావని ప్రశ్నిస్తే, తరుణ్ ఎదురు ప్రశ్నలు వేశాడు. గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్ తీసుకున్నారని భావిస్తే ఎలాగని సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించిన ఆయన, కెల్విన్ తదితరులు ఈవెంట్ మేనేజర్లుగా పరిచయం అయ్యారని, పార్టీల్లో కలుస్తూ ఉన్నందున, ఇద్దరమూ వీడియోల్లో కలిసుండవచ్చని తెలిపాడు.
ఉదయం 10.15 గంటలకు మొదలైన విచారణ, రాత్రి 11.40 గంటల వరకూ సాగింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని, కావాలంటే రక్త నమూనాలు తీసుకోవచ్చని తరుణ్ వెల్లడించిన తరువాతనే, ఆయన రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్లను ఉస్మానియా ఆసుపత్రి అధికారులు తీసుకున్నారు. ఇక తాజా ఆరోపణలు వచ్చిన బడా నిర్మాత కుమారుడు ఓ నటుడిగా, ఇటీవల వచ్చిన ఓ చిత్రం చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. కావాలనే తన కుమారుడిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని సదరు నిర్మాత మీడియా ముందు వాపోయాడు కూడా. ఈ కేసులో ఆ హీరోకు నోటీసులు అందితే, కేసు పెద్ద మలుపు తిరిగినట్టేనని అధికారులు అంటున్నారు.