: బాలుడిని ఈడ్చుకెళ్లి చంపేసిన చిరుత
నిద్రిస్తున్న బాలుడిని ఓ చిరుత ఈడ్చుకెళ్లి చంపేసిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని రాంగోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమ ఏడేళ్ల కుమారుడు సంజయ్ కనపడకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చివరకు ఆ బాలుడిని చిరుత చంపేసిందని గుర్తించారు. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో ఆ బాలుడి మృతదేహం లభించింది. కాలిముద్రల ఆధారంగా చిరుతే ఆ బాలుడిని ఈడ్చుకెళ్లి చంపేసిందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
ఈ ఘటనపై మండిపడ్డ గ్రామస్తులు తమ గ్రామంలోకి అడవినుంచి క్రూరమృగాలు వచ్చి దాడులు చేస్తున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు.