: అబు బాకర్ అల్-బాగ్దాదీ బతికే ఉన్నాడు: అమెరికా రక్షణ సంస్థ వ్యాఖ్య
ఐసిస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు అబు బాకర్ అల్-బాగ్దాదీ జీవించే ఉండొచ్చునని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ చీఫ్ జిమ్ మ్యాటిస్ తెలిపారు. `నాకు తెలిసి బాగ్దాదీ బతికే ఉన్నాడు. మా చేతుల్తో మేం చంపే వరకు అతను చనిపోయాడన్న విషయాన్ని నేను నమ్మను` అని జిమ్ వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా బాగ్దాదీ మరణించాడని వస్తున్న వార్తలను జిమ్ కొట్టిపారేశారు.
గతవారం సిరియాకు చెందిన సీనియర్ ఐసిస్ నాయకుల అభిప్రాయం ప్రకారం సిరియాలోని డైర్ ఎజ్జోర్ ప్రాంతంలో బాగ్దాదీ చనిపోయాడని బ్రిటన్కు చెందిన మానవ హక్కుల అబ్జర్వేటరీ ప్రకటించింది. అలాగే ఇంతకుముందు తాము చేసిన దాడిలో బాగ్దాదీ మరణించాడా? లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉందని రష్యన్ ఆర్మీ కూడా ప్రకటించింది. కానీ ఇవేవీ నమ్మకుండా అమెరికా మాత్రం బాగ్దాదీ బతికే ఉన్నాడని భావిస్తూ అతన్ని చంపే ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. 2014లో మోసుల్లోని మసీదులో తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న దగ్గర్నుంచి బాగ్దాదీ ఆచూకీ తెలియరాలేదు.