: కెల్విన్ మామూలోడు కాదు... అకున్ సబర్వాల్ ను ఫోన్ లో బెదిరించిన వ్యక్తిది ఆఫ్రికా దేశాల యాస!
తెలంగాణ ఎక్సైజ్ డీజీపీ అకున్ సబర్వాల్ పట్టుకున్న డ్రగ్ డీలర్ కెల్విన్ మామూలోడుకాదన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో కెల్విన్ కు బలమైన సంబంధాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో డ్రగ్స్ అమ్మకం, సరఫరాలో కాకలుతీరిన వారితో కెల్విన్ సరఫరా చేయించుకునేవాడు. కెల్విన్ కు ఏదైనా జరిగితే వారు రంగంలోకి దిగేందుకు సిధ్ధంగా ఉన్నట్టు పలు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. కెల్విన్ ద్వారా అంతర్జాతీయ డ్రగ్ ముఠా భారత్ లో భారీ డ్రగ్ విక్రయాలు జరుపుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ కు ఇంటర్నేషనల్ వాయిస్ కాల్స్ ద్వారా గత పదిరోజులుగా బెదిరింపులకు దిగుతోంది.
నీ కుటుంబం వివరాలు, పిల్లల చదువులు, స్కూళ్లు ఇలా చాలా విషయాలు తెలుసని ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అకున్ సబర్వాల్ తో బెదిరింపులకు దిగుతోంది. ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ను ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడాడని తెలుస్తోంది. ఎక్కడో తెలంగాణలో ఎక్సైజ్ డీజీపీ ఫోన్ నెంబర్ ను సంపాదించిన డ్రగ్ మాఫియా బెదిరింపులకు దిగుంతోందంటే ఈ కేసు తీవ్రత ఎంత లోతైనదో అధికారులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కెల్విన్ ముఠాకు నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలతో పాటు అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అకున్ సబర్వాల్ అంత స్థాయి ఉన్నతాధికారిని బెదిరించడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో వారి ఆటకట్టించేందుకు పావులు కదుపుతున్నారు.