: త్వరలో ప్రవాస భారతీయులకు ఓటుహక్కు... రాజ్యాంగసవరణకు కేంద్రం ఓకే!
భారతదేశంలో పుట్టి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఓటు హక్కు కల్పించే పనిలో కేంద్రం మరో ముందడుగు వేసింది. ఈ అవకాశం కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయడానికి తాము సుముఖంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం 15 రోజుల్లోగా ఇందుకు సంబంధించిన వివరాలన్నీ అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ సౌకర్యాలను కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసిన మేరకు ఈ సౌకర్యాలకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ రాజ్యాంగ సవరణ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస భారతీయులకు తమ స్వదేశంలో ఓటు వేసి, ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుంది.