: ఎస్కార్ట్, సెక్యూరిటీ లేకుండా స్నేహితుడి కారులో ఒంటరిగా గవర్నర్ వద్దకు జగన్ ఎందుకు వెళ్లారు?: వర్ల రామయ్య
వైసీపీ అధినేత జగన్ కు అన్ని దార్లు మూసుకుపోయాయని... ఒక జైలు దారి మాత్రమే మిగిలిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కేసు విచారణలతో జగన్ భయపడిపోతున్నారని చెప్పారు. గవర్నర్ ను కలసిన జగన్ ఆయనతో ఏ ప్రజా సమస్యలపై చర్చించారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రక్షించమని వేడుకునేందుకే గవర్నర్ ను జగన్ కలిశారని ఎద్దేవా చేశారు.
జగన్ కు అపాయింట్ మెంట్ ఎలా ఇచ్చారో గవర్నర్ చెప్పాలని వర్ల అన్నారు. మీతో చర్చించేంత ప్రజాసమస్యలు జగన్ కు ఏమున్నాయని ప్రశ్నించారు. నదుల, తుపానుల వల్ల అల్లకల్లోలం జరిగిందా, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందా, ఏ సమస్యను చర్చించడానికి ఫోన్ ద్వారానే ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని గవర్నర్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించాలని గవర్నర్ కార్యాలయాన్ని తాను కోరుతున్నానని చెప్పారు.
గవర్నర్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు జగన్ తన ఎస్కార్టును తీసుకెళ్లలేదని, రోజూ వాడే వాహనంలో వెళ్లలేదని, సెక్యూరిటీ సిబ్బందిని తీసుకెళ్లలేదని... ఒక స్నేహితుడి వాహనాన్ని తెప్పించుకుని, ఒంటరిగా గవర్నర్ ను కలిశారని అన్నారు. కేసులోని ఏ2, ఏ3లాంటి మిగతా నిందితులకు కూడా తెలియకుండానే వెళ్లాడని ఎద్దేవా చేశారు. కారును దూరంగా ఆపి, నడచుకుంటూ వెళ్లి గవర్నర్ తో ఏం మాట్లాడారని జగన్ ను ఉద్దేశించి అన్నారు.