: మంగళగిరిని మరో సైబరాబాద్ చేస్తాం: మంత్రి నారా లోకేశ్
మంగళగిరి కూడా భవిష్యత్ లో సైబరాబాద్ లా అభివృద్ధి సాధిస్తుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పైకేర్ సర్వీసెస్ ఐటీ సంస్థను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు. ఏపీకి మరిన్ని ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకుగాను, కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాలు తీసుకొచ్చామని చెప్పారు. విశాఖతో సమానంగా అమరావతిని ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా చేస్తామని, మంగళగిరిలో ఐటీ పార్కుకు ఇప్పటివరకు రూ.220 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 2019లోపు మంగళగిరి ఐటీ క్లస్టర్ లో పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడం ఖాయమని చెప్పారు.