: దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు కూడా లేడు: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి వెయ్యి మంది ప్రజలకి కనీసం ఒక వైద్యుడు కూడా లేడని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. లోక్సభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ప్రతి వెయ్యి మంది ప్రజలకి ఒక వైద్యుడు ఉండాలి కానీ దేశంలో వైద్యులకి, ప్రజలకి మధ్య నిష్పత్తి 0.62 : 1000 గా ఉందని ఆమె వివరించారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఈ నిష్పత్తి చాలా తక్కువని ఆమె చెప్పారు. వీలైనంత త్వరగా ఈ నిష్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుప్రియ పటేల్ తెలిపారు. పాకిస్థాన్లో డాక్టర్లకి, ప్రజలకి మధ్య నిష్పత్తి 0.8 : 1000 ఉండగా, ఆస్ట్రేలియాలో 3.374 : 1000, చైనాలో 1.49 : 1000, అమెరికా 2.554 : 1000గా ఈ నిష్పత్తి ఉంది.