: హైదరాబాద్ గోషామహల్ లో ఎగిరే పాము ప్రత్యక్షం!
హైదరాబాద్ లోని గోషామహల్ ప్రాంతంలో విషపూరితమైన ఎగిరేపాము కలకలం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ తరహా పాము కనబడలేదు. ఈ రకపు పామును చూడటం ఇదే మొట్టమొదటసారి కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, గోషామహల్ లోని ఓ ఫ్లైవుడ్ షాపు యజమాని తమకు ఫోన్ చేసి.. తమ షాపు ప్రవేశ ద్వారం వద్ద చిన్నపాము కనిపించిందని చెప్పడంతో తమ సభ్యులు అక్కడికి వెళ్లి ఈ పామును పట్టుకున్నట్టు చెప్పారు.
ఈ పామును సైనిక్ పురిలోని జంతు సంరక్షణా కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. కాగా, గోషామహల్ లోని ఈ షాపు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు టింబర్ డిపోలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి కలప, ఫ్లైవుడ్ తరలించే క్రమంలో వాటితో పాము ఈ ఎగిరే పాము వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సాధారణంగా ఎగిరే పాములు పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్యరాష్ట్రాల, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి.