: పెట్టుబడుల్లో షేర్లకే మొదటి ప్రాధాన్యం అంటున్న మదుపర్లు... సర్వేలో వెల్లడి!
చిన్న మొత్తాల పొదుపులు, డిపాజిట్ల కంటే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికే ఎక్కువ మంది మదుపర్లు మొగ్గు చూపుతున్నట్లు ఓ తాజా సర్వేలో తేలింది. ఇటీవల సెన్సెక్స్ 30,000 పాయింట్లు దాటిన తర్వాత జియోజిత్ సెక్యూరిటీస్ వారు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆన్‌లైన్ ద్వారా దాదాపు 6 లక్షల మందిని ప్రశ్నించిన జియోజిత్ వారు, సెబీ అవగాహనా కార్యక్రమాల వల్లే మదుపర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారని తేల్చిచెప్పింది.
ఇక లెక్కల్లోకి వెళ్తే... 83.45 శాతం మంది నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతుండగా, 20 శాతం మంది నెల వారీ ప్రాతిపదికన, 59.25 శాతం మంది మిగులు నిధులు ఉన్నపుడు ఈక్విటీల్లో పెడతామని చెప్పారు. ఇక ఈక్విటీల తర్వాత మ్యూచ్‌వల్ ఫండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అన్నిటికన్నా తక్కువగా డెరివేటివ్స్ పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చారు.
62 శాతం మంది అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన ట్రేడింగ్‌లో 14.55 శాతం మంది ప్రతిరోజు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఎక్కువ లాభాలు రావాలంటే ఈక్విటీల్లో పెట్టుబడి శ్రేయస్కరమని 65.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే డెరివేటివ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే అందుకు సంబంధించిన అనుభవం ఉండాలని చాలా మంది మదుపర్లు సలహా ఇచ్చారు.