: అమ్యూజ్ మెంట్ పార్క్, థియేటర్, స్టార్ హోటల్, సాహస క్రీడలు... అమరావతిలో సంక్రాంతి నాటికి 'ఉల్లాసవనం'!


నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా ఉండేలా 241 ఎకరాల్లో సకల వసతులతో వచ్చే సంక్రాంతి నాటికి ఉల్లాసవనాన్ని సిద్ధం చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు అనుమతిచ్చారు. సీఆర్డీయే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పార్కు ఎలా ఉండాలన్న విషయమై డిజైన్లను ఆమోదించారు. దీనికి 'గాంధీ మెమోరియల్' అని పేరు పెట్టాలని వెల్లడించారు. అహ్మదాబాద్ కు చెందిన హెచ్పీసీ సంస్థ దీన్ని రూపొందించనుంది. నాలుగు జోన్లుగా ఉండే ఈ వనం మధ్యలో పెద్ద జలాశయం ఉంటుంది. రూ. 936 కోట్లలో అమ్యూజ్ మెంట్ పార్కు, రూ. 11 కోట్లతో యాంఫీ థియేటర్, రూ. 259 కోట్లతో రిసార్టు, రూ. 44 కోట్లతో పిల్లల సాహస క్రీడల పార్కు, రూ. 324 కోట్లతో స్టార్ హోటల్, రూ. 34 కోట్లతో స్పోర్ట్స్ క్లబ్ / ఫిట్ నెస్ సెంటర్, రూ. 35 కోట్లతో క్రాఫ్ట్ బజార్ ఇక్కడ నిర్మితమవుతాయి.

 మొత్తం రూ. 1,643 కోట్లతో నిర్మితమయ్యే పార్కును ఆరు నెలల్లోగా పూర్తి చేసి సంక్రాంతి నాటికి ప్రారంభించాలన్నది చంద్రబాబు యోచన. జలాశయంలో బోటింగ్, జల క్రీడలతో పాటు, పెంపుడు జంతువుల కోసం ఓ పార్కు, అవుట్ డోర్ వ్యాయామశాల, రాక్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్, డక్ పాండ్, జాగింగ్ ట్రాక్, యోగా, ధ్యాన కేంద్రాలు, సాంస్కృతిక మ్యూజియం, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్, ఈవెంట్స్ కోసం 12 ఎకరాల మైదానం తదితరాలు ఇందులో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్న అంబేద్కర్ పార్కు, భారీ విగ్రహం కూడా ఉల్లాసవనం ప్రాజెక్టులో భాగం కానున్నాయి.

  • Loading...

More Telugu News