: జ్యోతిలక్ష్మి’ ఈవెంట్ కోసం కెల్విన్ కు డబ్బులిచ్చానన్న పూరీ జగన్నాథ్!
డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పలు విషయాలు చెప్పినట్టు సమాచారం. పూరీ దర్శకత్వంలో ఛార్మీ హీరోయిన్ గా గతంలో విడుదలైన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’. కెల్విన్ బ్యాంక్ అకౌంట్ కు పూరీ డబ్బులు పంపిన ఆధారాలను, అతనితో ఉన్న ఫొటోలను పూరీ జగన్నాథ్ కు అధికారులు చూపించినట్టు సమాచారం. ‘జ్యోతిలక్ష్మి’ ఈవెంట్ కోసం కెల్విన్ కు తాను డబ్బులు ఇచ్చానని అధికారులతో పూరీ చెప్పినట్టు తెలుస్తోంది.
‘జ్యోతిలక్ష్మి’ ఆడియో ఫంక్షన్ కు కెల్విన్, నైజీరియన్ జీషన్ కూడా హాజరైన విషయాన్ని పూరీతో అధికారులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాగా, సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని, ఓ మిత్రుడి ద్వారా కెల్విన్ తనకు పరిచయమయ్యాడని విచారణాధికారులకు పూరీ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు పూరీ జగన్నాథ్ ని అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది.