: అన్ని విషయాల్లోనూ స్పీడుగా ఉండండి... రోడ్డు మీద తప్ప!: రాజమౌళి
`ఈ రోజుల్లో యువత చాలా స్పీడుగా ఉంటున్నారు. అది అభివృద్ధికి ఎంతో అవసరం. అన్ని విషయాల్లోనూ అలాగే ఉండాలి... ఒక్క రోడ్డు మీద తప్ప. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయండి` అంటూ దర్శకుడు రాజమౌళి సందేశమిచ్చారు. హైద్రాబాద్ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం వల్ల మరణించేవారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న వారి సంఖ్యే వంద రెట్లు అధికంగా ఉంటోందని, వేగంగా నడపడం, రాంగ్ రూట్లో వెళ్లడం వంటి చిన్న చిన్న తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకోకండని ఆయన చెప్పారు.
ఒకప్పటితో పోలిస్తే టెక్నాలజీలో వచ్చినంత అభివృద్ధి రవాణా రంగంలో రాలేదని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి రోడ్ల మీద, సందుల్లో డ్రైవ్ చేయాలని రాజమౌళి హితవు పలికారు. అలాగే తాగి ఉన్నపుడు మనలో ఉన్న అపరిచితుడు మనల్ని డ్రైవింగ్ చేయమంటాడని, వాడి మాట వినకుండా క్యాబ్‌లో గానీ, బస్సులో గానీ వెళ్లాలని ఆయన నవ్వుతూ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు నటుడు అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు.