: పూరీకి బ్రేకిచ్చిన సిట్ అధికారులు!
దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం దర్శకుడు పూరీ జగన్నాథ్ కు సిట్ అధికారులు విరామం ఇచ్చారు. ఈ రెండున్నర గంటల్లో ఆయన సమాధానాలను విని పూర్తి సంతృప్తి చెందని అధికారులు, భోజన విరామం తరువాత మరోసారి ఆయన్ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడికే భోజనం తెప్పించుకున్న పూరీ జగన్నాథ్, తన కుమారుడు, తమ్ముడితో కలసి భోజనం చేయాలని నిర్ణయించుకోగా, అందుకు అధికారులు అనుమతించినట్టు తెలుస్తోంది.
స్వల్ప విరామం అనంతరం తిరిగి 1.30 గంటల నుంచి పూరీ జగన్నాథ్ ను విచారించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, సుమారు 20 ప్రశ్నలకు పూరీ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా తరచూ బ్యాంకాక్ కు వెళ్లే పూరీ, ఎందుకు వెళుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అక్కడి నుంచి డ్రగ్స్ ఏమైనా తెస్తున్నారా? అన్న కోణంలో విచారణ సాగినట్టు సమాచారం. కథలు వినేందుకే బ్యాంకాక్ వెళ్తానన్న పూరీ మాటలను సిట్ విశ్వసించడం లేదని తెలుస్తోంది.