: బల పరీక్షకు డుమ్మా కొట్టిన నాగాలాండ్ సీఎం!
ఈ ఉదయం నాగాలాండ్ రాజధాని కోహిమాలోని రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణను ఎదుర్కోవాల్సిన ముఖ్యమంత్రి షుర్హోజెలీ లీజీట్సు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. పరీక్షకు నిలిస్తే, ఓడిపోతామన్న భయంతోనే ఆయన ఈ పని చేసినట్టు తెలుస్తోంది. లీజిట్సు సహా, ఆయన మద్దతు ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో హాజరు కాకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
కాగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు సీఎంపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రంలో తనకు 41 మంది మద్దతుందని చెబుతూ కాంగ్రెస్ నేత టీఆర్ జీలియాంగ్ గవర్నర్ ను ఆశ్రయించగా, ఆయన బలపరీక్షకు ఆదేశించారు. దీన్ని నిలిపివేయాలని లీజిట్సు కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. కోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉదయం బలం నిరూపించుకోవాలని లీజిట్సును కోరగా, మాజీ సీఎం టీఆర్ జెలియంగ్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చిందని స్పీకర్ తెలిపారు.