: పూరీకి అత్యంత కీలకమైన ప్రశ్న... 'రవితేజకు డ్రగ్స్ ఇస్తున్నారా?'... సిట్ అధికారుల వద్ద సంబంధిత ఫోటో!
డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ కు సంబంధాలు ఉన్నాయని పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతనే, విచారణకు పిలిపించిన సిట్ అధికారులు, తమ ప్రశ్నలతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమయ్యారు. సిట్ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, అడిగే ప్రశ్నలన్నింటికీ వారి వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. కెల్విన్ తో సంభాషణల మొదలు, డ్రగ్స్ వాడకంపై వీడియోల వరకూ సిట్ సేకరించింది.
ఇక అత్యంత కీలకమైన ఓ ఫోటో పూరీ జగన్నాథ్ ను ఇబ్బందులు పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. హీరో రవితేజ, అతని సోదరుడు, ఇటీవల మరణించిన భరత్ లకు పూరీ స్వయంగా డ్రగ్స్ అందిస్తున్న ఫోటో ఒకటి సిట్ వద్ద ఉంది. ఈ ఫోటోకు ఆయన సమాధానం చెప్పాల్సి వుంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి కాబట్టే, తొలుత అతన్ని ప్రశ్నించాలని నిర్ణయించామని కూడా ఆయన తెలిపారు. పూరీ సరైన సమాధానాలు ఇస్తే, టాలీవుడ్ లో మరింత మందికి డ్రగ్స్ తో ఉన్న బంధాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఇక ఆయన్ను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు లేవని, అవసరం అనుకుంటే మరోసారి విచారిస్తామని చెప్పి పంపనున్నామని అధికారులు అంటున్నారు.