: ప్రైవేటు ఫొటోలు నెట్లో పెడతానన్న యువకుడు.. రూ.4 లక్షలు సమర్పించుకున్న యువతి.. నెల్లూరులో ఘటన!
ప్రేమికుడని దగ్గరైతే బ్లాక్‌మెయిల్‌కి దిగి ఆమె నుంచి లక్షల రూపాయలు కాజేశాడో యువకుడు. నెల్లూరులో జరిగిందీ ఘటన. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మహాత్మాగాంధీ నగర్‌కు చెందిన యువతి (22) బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. మూడేళ్ల క్రితం జ్యోతినగర్ మసీదు వీధికి చెందిన షేక్ అల్లాభక్షుతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
అది క్రమంగా సాన్నిహిత్యానికి దారితీసింది. ఆమె అతడితో సన్నిహితంగా ఉన్నప్పుడు యువతికి తెలియకుండానే ఫొటోలు తీశాడు. ఇటీవల అల్లాభక్షు తనకు రూ.6 లక్షలు కావాలని యువతిని కోరాడు. తన వద్ద అంత డబ్బు లేదని యువతి చెప్పడంతో తన వద్ద ఉన్న ఫొటోలు నెట్లో పెడతానని బెదిరించాడు. అంతేకాదు వారం రోజుల్లో అడిగినంత ఇవ్వకుంటే రోజుకు రూ.50 చొప్పున అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
అతడి బెదిరింపులకు భయపడి పోయిన యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లోని బీరువాలో ఉన్న 5.72 లక్షలు తీసింది. సోమవారం ఆ సొమ్ము పట్టుకుని అల్లాభక్షును కలిసింది. అంతకుముందు ఓ దుకాణంలో రూ.30 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొని, దానితోపాటు రూ.4 లక్షలు అతడి చేతిలో పెట్టి, అతని నుంచి ఫొటోలున్న పెన్ డ్రైవ్‌ను తీసుకుంది. ఇంట్లోని డబ్బులు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు యువతిని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.