: బెల్టు షాపులు తొలగించకపోయినా, ఇకపై ఆరుబయట తాగినా చర్యలు తప్పవు: ఏపీ మంత్రి జవహర్
ఏపీలో రేపటి నుంచి బెల్టు షాపులు రద్దు చేయాలని కేబినెట్ సమావేశంలో తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ ను ఓ న్యూస్ ఛానెల్ పలకరించగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీ మేరకు బెల్టు షాపులను దఫాదఫాలుగా రద్దు చేసుకుంటూ వచ్చామని, తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 6,300 బెల్టు షాపులపై కేసులు పెట్టడం జరిగిందని అన్నారు.
మహిళల ఆందోళనలు సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చాయని.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకుండా, దీనిపై ఆదాయం మనకు అక్కర్లేదని అనుకున్నారని, అందులో భాగంగానే బెల్టుషాపులను వెంటనే తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బార్ షాపు లేదా వైన్ షాప్ లో ఉండే సిట్టింగ్ ప్లేసులోనే మద్యం సేవించాలి తప్పా, బయటకు వచ్చి తాగినా, ఆకతాయిల్లా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని, యాక్టు ప్రకారం వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుందని జవహర్ చెప్పారు.