: ఆ పత్రిక నాపై విషం చిమ్ముతోంది: ఎమ్మెల్యే రోజా ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారని ఓ పత్రికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తనకు నోటీసులు జారీ చేయకముందే ఓ పత్రికలో, ఛానెల్‌లో నోటీసులు జారీ అయిపోయాయని రాసేశారని మండిపడ్డారు. నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను చూసి, అత్యుత్సాహంతో తప్పుడు వార్తలు రాసేశారని చెప్పారు. ఆ పత్రిక ఎప్పుడూ తన మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని ఆమె చెప్పారు.
అసలు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకి నిన్నటి ఇష్యూ గురించి తెలియక ముందే, తనకు ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు ఇచ్చేశారని రాసేశారని రోజా చెప్పారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ఆ పేపర్ పేరు చంద్రజ్యోతి పేపర్ అని, ఆ ఛానెల్ పేరు చంద్రజ్యోతి ఛానెల్ అని చెప్పారని, నిజంగా అలా ఎందుకు చెప్పారో తనకు ఇప్పుడు అర్థమవుతుందని అన్నారు. కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ పదవిలో ఉండి టీడీపీకి సంబంధించిన అంశాలు హైలైట్ చేయడం వంటివాటికి పాల్పడుతున్నారని,
ఒక విలువ ఉండే విధంగా ప్రవర్తించాలని, ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని రోజా వ్యాఖ్యానించారు.