: ఇర్ఫాన్ పఠాన్ సెల్ఫీ పోస్ట్... మతం రంగు పులిమిన నెటిజన్లు!
భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సరదాగా తన భార్య సఫా బైగ్‌తో దిగిన సెల్ఫీకి కొందరు నెటిజన్లు మతం రంగు పులిమారు. `ఈ అమ్మాయితో పెద్ద సమస్య` అంటూ తన భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఇర్ఫాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇందులో సఫా తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకున్నట్టుగా ఉంది. చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడమే నెటిజన్లకు సమస్యగా మారింది. `నెయిల్ పాలిష్ కాదు మెహందీ పెట్టుకో!` అంటూ సలహాలు, `ముస్లిం అయి ఉండి నీ భార్య ముఖాన్ని అందరికీ చూపిస్తావా?` అంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఇంకా కొంత మంది నెటిజన్లు తమ హద్దు మీరి కామెంట్లు చేశారు. ఇలా భారత ముస్లిం క్రికెటర్లకు మతం రంగు పులమడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో మహ్మద్ షమీ షేర్ చేసిన ఫొటోలో తన భార్య స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకుని ఉండటంపై కొంతమంది మండిపడ్డారు. అందుకు ప్రతిగా వారి హద్దులు గుర్తుచేస్తూ షమీ సమాధానం ఇవ్వడంతో నెటిజన్లు వెనక్కి తగ్గారు.