: కొనసాగుతున్న సస్పెన్స్... రేపు పూరీ జగన్నాథ్ విచారణకు రాకుంటే, తదుపరి చర్యలు ఏమిటి?
టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో ప్రమేయమున్న తెలుగు సినీ ప్రముఖులు రేపటి నుంచి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుందన్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి తమ వద్ద ఉన్న సమాచారంపై మరింత లోతుగా విశ్లేషించేందుకు 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించగా, రేపు దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరు కావాల్సి వుంది.
అయితే, ఇప్పటివరకూ పూరీ జగన్నాథ్, తనకు నోటీసులు అందినట్టు అధికారికంగా ప్రకటించలేదు. రేపు విచారణకు ఆయన హాజరవుతారా? లేదా? అన్న విషయంలోనూ స్పష్టత కొరవడింది. అసలు ఆయన హైదరాబాద్ లో ఉన్నారా? అన్న విషయంలో కూడా తమ వద్ద సరైన సమాచారం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు పూరి సిట్ పోలీసుల ముందుకు రావాల్సి వుండగా, ఒకవేళ ఆయన రాకుంటే, ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని సిట్ వర్గాలు వెల్లడించాయి.