: స్వతంత్ర భారతావనిలో వెంకయ్యనాయుడికే సొంతమైన రికార్డిది!
68 సంవత్సరాల వయసులో ఈ ఉదయం ఎన్డీయే తరఫున భారత ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకూ ఎన్నికైన ఉప రాష్ట్రపతులంతా, స్వాతంత్ర్యం రాకముందు పుట్టినవారే. తొలిసారిగా స్వాతంత్ర్యానంతరం పుట్టిన వ్యక్తి ఆ పదవిని అలంకరించేందుకు రంగం సిద్ధమైంది.
వెంకయ్యనాయుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న నెల్లూరు సమీపంలోని చవటపాలెంలో 1949 జూలై 1న జన్మించారన్న సంగతి తెలిసిందే. విద్యార్థినేతగా, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు సార్లు ఎంఎల్ఏగా పని చేసిన ఆయన, ఆర్ఎస్ఎస్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆపై బీజేపీలో రాణించారు. ఇప్పుడు దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు.