: జగన్ కు కొత్త తలనొప్పి.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అయితే.. కింకర్తవ్యం?
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ లాంటి అత్యున్నత పదవులను అధిరోహించే వ్యక్తిని పోటీ లేకుండానే ఎన్నుకోవాలని... అదే తమ అభిమతమని వైసీపీ అధినేత జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే, తాము ప్రధాని మోదీని కలసి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించామని ఆయన గతంలో చెప్పారు. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి పేరు దాదాపు ఖరారయినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఇప్పుడు జగన్ కు అసలైన కొత్త తలనొప్పి ప్రారంభమైంది.
వెంకయ్యనాయుడితో జగన్ కు ఏమాత్రం సంబంధాలు లేవు అనే విషయం అందరికీ తెలిసిందే. పైగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంకయ్య అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. మొన్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ తో సమావేశం సందర్భంగా పక్కనే వెంకయ్య ఉండటం వల్ల జగన్ చాలా ఇబ్బంది పడినట్టు వార్తలు వచ్చాయి. వెంకయ్యతో కలిసిన ఎమ్మెల్యేలపై కూడా ఆయన కొంచెం సీరియస్ అయినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, ఎన్డీయే అభ్యర్థిగా వెంకయ్య పేరు ఖరారైతే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి జగన్ కు తలెత్తింది. విధిలేని పరిస్థితుల్లో వెంకయ్యకు మద్దతు ఇవ్వడమా? లేక తాను చెప్పిన మాటను తానే తప్పి, ప్లేటు ఫిరాయించడమా? రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు.