: 'వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి' అంటే బాధేస్తోంది: మంత్రులు గంటా, పుల్లారావు
కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతిగా వెళ్లనున్నారన్న వార్తలు వింటే తమకెంతో బాధ కలుగుతోందని ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటేనే రాష్ట్రానికి మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించిన గంటా, విభజన తరువాత ఏర్పడ్డ సమస్యల పరిష్కారానికి వెంకయ్య ఎంతో చొరవ చూపారని చెప్పారు. రాష్ట్రాన్ని ఇంకా సమస్యలు పీడిస్తున్నాయని, వెంకయ్య వంటి వ్యక్తి సేవలు దూరమైతే, సమస్యలు అలాగే ఉండిపోతాయని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయనకు ఎంతో అవగాహన ఉందని, అటువంటి వ్యక్తి కేంద్రమంత్రిగా ఉంటేనే లబ్ధి చేకూరుతుందని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. అందరికీ న్యాయం జరగాలంటే, ఆయన ప్రభుత్వంలోనే ఉండాలన్నది తమ అభిప్రాయమని తెలిపారు.