: దాసరిని గుర్తు చేసుకున్న రాజ్యసభ... నివాళులర్పించిన ఎంపీలు
ఇటీవల కన్నుమూసిన రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు రాజ్యసభ ఘనంగా నివాళులు అర్పించింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన తరువాత, దాసరి పేరును ప్రస్తావిస్తూ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప సందేశాన్ని వినిపించారు. పలు రంగాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు. సినిమా, పత్రికా రంగంలో ఎంతో మందికి ఉపాధిని చూపించారని, ఎన్నో పార్లమెంటరీ సంఘాల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకుందని అన్సారీ గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా దాసరి స్ఫూర్తిదాయకంగా పని చేశారని అన్నారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఇక్కడ ఉన్న దాసరి మరణం తీరని లోటని అన్నారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దాసరి మృతికి సంతాప సూచకంగా, సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.