: నాకొద్దులే... చెన్నమనేనికి ఇవ్వండి: అమిత్ షాతో వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతిగా దక్షిణాది నేతను ఎంపిక చేయాలని నరేంద్ర మోదీ భావిస్తున్న నేపథ్యంలో తన పేరు తెరపైకి రావడంపై వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ విషయంలో రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తరువాత తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని, ఓటు వేసేందుకు వచ్చిన ఆయన స్పష్టం చేశారు. ఇక "మిమ్మల్ని ఉపరాష్ట్రపతిగా చేయాలని భావిస్తున్నాం" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెంకయ్యనాయుడికి తెలియజేసిన వేళ, ఆయన అంత సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం తనకు ఇష్టం లేదని, ఎన్డీఏ సర్కారు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక ఈ పదవికి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్ రావు సరిగ్గా సరిపోతారని, తమిళనాడు ఎంపీ ఎల్ గణేశన్, కేంద్ర మాజీ మంత్రి, కేరళ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ లేదా రామ్ నాయక్ లలో ఒకరిని ఎంపిక చేయాలని కూడా వెంకయ్యనాయుడు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.