: నేడే రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటేయనున్న 4896 మంది ప్రజాప్రతినిధులు!
మరికొన్ని గంటల్లో దేశ అత్యున్నత పదవి కోసం ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈనెల 20న ఓట్లను లెక్కిస్తారు. నేటి (సోమవారం) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎన్డీఏ పక్షాల తరపున రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ పక్షాల తరపున మీరా కుమార్ బరిలో ఉన్నారు.
మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పార్లమెంటులో ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణముంటే, ఈసీ అనుమతితో వేరే పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ బాధ్యతను రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహించారు.