: దళితులను పరామర్శించేందుకు అనుమతించని ప్రభుత్వం సిగ్గుపడాలి!: వైసీపీ నేత బాలినేని
ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూమిపై నెలకొన్న వివాదంలో బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న వైసీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించడం, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్టు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం చాలా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం, పరామర్శించేందుకు వెళుతున్న తమను అడ్డుకోవడం దారుణమని అన్నారు. నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో తన ఇంటికి పోలీసులు వచ్చారని, బయటకు కదిలేందుకు వీల్లేదని చెప్పి హౌస్ అరెస్టు చేశారని అన్నారు.
తమ పార్టీకి చెందిన కొంతమంది నాయకులను పోలీసులు అరెస్టు కూడా చేశారని, ఈ విధంగా చేయడం చాలా అన్యాయమని, ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని విమర్శించారు. దళితులను పరామర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతించడం లేదంటే ప్రభుత్వం చాలా సిగ్గుపడాల్సిన విషయమని, ఇలాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ విధంగా మమ్మల్ని ఆ గ్రామానికి పోనీయకుండా ఎన్నిరోజులు ఆపుతారంటూ బాలినేని ప్రశ్నించారు.