: అమర్ నాథ్ యాత్రికుల మృతి అత్యంత బాధాకరం: ప్రధాని మోదీ
గుజరాత్ నుంచి జమ్మూ వెళ్తున్న అమర్ నాథ్ యాత్రికుల బస్సు అదుపుతప్పి లోయలో పడి పదహారు మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మరోపక్క, ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబ ముఫ్తీతో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్ల ద్వారా జమ్ము ఆసుపత్రికి తరలించినట్టు రాజ్ నాథ్ తెలిపారు. కాగా, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు.