: 'వైజాగ్‌ మేల్ టు మేల్‌.. ఓన్లీ వైజాగ్‌ బాయ్స్‌’ పేరిట నేరాలకు పాల్పడ్డ యువకుల అరెస్టు!


ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ను ఆధారంగా చేసుకుని నేరాలకు పాల్పడ్డ యువకులను విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ, స్వలింగ సంపర్కాన్ని అడ్డంపెట్టుకొని  ‘ఫేస్‌ బుక్’ లో  'వైజాగ్‌ మేల్ టు మేల్‌.. ఓన్లీ వైజాగ్‌ బాయ్స్’ పేరిట ఒక  'గే’ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. స్వలింగ సంపర్కానికి ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించేవారు. ఆ తర్వాత‌ బ్లాక్‌మెయిల్  చేసేవారు. విశాఖకు చెందిన ముక్కాల ఆదిత్య, అమీరుద్దీన్‌ ఖాన్‌, పెంట అరుణ్‌ కుమార్‌, ఉంగరాల రవిరాజ్‌, దంతా జితేష్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

ఇదిలా వుండగా, ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విశాఖకు చెందిన తాడి రాహుల్, ఎంవీపీ కాలనీలోని ఓ హాస్టల్‌లో నివసిస్తుంటాడు. ఈ గే గ్రూప్ తో  రాహుల్ పరిచయం పెంచుకున్నాడు. ఆదిత్యతో స్వలింగ సంపర్కానికి  రాహుల్ ఆసక్తి కనపరిచాడు. ఆదిత్య త‌న స్నేహితుల‌తో క‌లిసి రాహుల్‌ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడ రాహుల్‌ను దిగంబరంగా చేసి, ఈ ఐదుగురు యువకులు వీడియో చిత్రీకరించారు. అనంతరం, బ్లాక్‌ మెయిల్ కు పాల్పడ్డారు. తమకు రెండున్నర లక్షలు కనుక ఇవ్వకపోతే ఈ వీడియోను పోలీసులకు, మీడియాకు పంపిస్తామని బెదిరించారు.

దీంతో, రాహుల్ తన అకౌంట్‌లో ఉన్న రెండు లక్షల రూపాయలను వారికి బదిలీ చేశాడు. అనంతరం, ఈ విషయమై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ యువకుల ముఠాను పట్టుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ఆదిత్య.. గాజువాక, గోపాలపట్నం, పి.ఎం.పాలెం ప్రాంతాల్లోనూ ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలకు గురైన వారు ఇంకెవరైనా ఉంటే  త‌మ‌ను సంప్ర‌దించాల‌ని.. వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News